కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 2014 నాటికి దేశ అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపు రూ.155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.
అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సర్కారుకు పొంతనేలేదని పేర్కొన్నారు. దేశంలో ఒకో వ్యక్తిపై మోదీ 3 రెట్ల అధిక అప్పును మోపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో 8.5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించే బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. కానీ, అనేక సాకులతో కేంద్రం ఉపాధి కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి వారి పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, దేశ సంపదను పెద్దలకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్షాన్ని హేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. అలా మాట్లాడటం దేశ ప్రజలను అవమానించడేమని అన్నారు. హైదరాబాద్ వేదికగా దూరదర్శన్ కేంద్ర బడ్జెట్ పై చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అన్న భావంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యంపై జోకులు వేయవద్దని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మెరుగైన ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యంపై జోకులు వేయవద్దని అడుగుతున్నా. ఇలా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అని పేర్కొన్నారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ తమ వంతులుగా భాగస్వాములు కావాల్సి వుందన్నారు.