అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయమంటే కేంద్రానికి జంకు ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగించిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారని పేర్కొన్నారు.
అదానీ సంస్థ అనేక ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూలు) నుంచి అప్పులు తీసుకుందన్నారు. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. ఎస్‌బీఐ రూ. 27వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని వివరించారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51 శాతం పడిపోగా, ఎల్‌ఐసీ రూ. 18 వేల కోట్లు నష్టపోయిందన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒకసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని కవిత ప్రశ్నించారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన మిత్రులైన పారిశ్రామిక వేత్తల పైనే ఎకువ పట్టింపు ఉందనే విషయం ఆయన ప్రసంగంతో తేటతెల్లమైందని అన్నారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని చురకలంటించారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, ఏటా ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తున్నారని మండిపడ్డారు.