మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. అయితే… ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో… ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కవితకు మద్దతుగా వుంటూ… బీజేపీపై మండిపడుతున్నారు. తాజాగా… హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో కవితకి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. “ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్, సేవ్ ఇండియా ఫ్రం బిజెపి, వి ఆర్ విత్ కవితక్క” అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ పేరుతో ఇవి ఏర్పాటయ్యాయి.
ఇక… జూబ్లీ, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ లలో కూడా ఫ్లెక్సీలు వచ్చేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. . దేశాన్ని పాలిస్తున్న బిజెపి వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తూ దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్న వేళ దేశాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించడంతోనే బిజెపి కక్షపూరిత చర్యలకు దిగిందని అలిశెట్టి మండిపడ్డారు. సంక్షేమ పథకాలలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర పూరిత రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ధర్మ యుద్ధంలో బీఆర్ఎస్ దే తుది విజయమని అన్నారు.