ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నేటి ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే… ఈడీ అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలను తన ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీ కార్యాలయానికి కవిత పంపారు. కవిత ప్రతినిధి సోమా భరత్ ఈడీ కార్యాలయంలో కొన్ని పత్రాలను సమర్పించారు. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో వుందని, కోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు హాజరవుతానని ఆ లేఖలో కవిత పేర్కొన్నారు.
అయితే… ఇందుకు ఈడీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి సోమా భరత్ ఇంకా ఈడీ కార్యాలయంలోని వెయిటింగ్ రూమ్ లోనే వున్నారు.ఒకవేళ కవిత ప్రతిపాదనను ఈడీ అంగీకరించని పక్షంలో… కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూనే వున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ నివాసం నుంచి విచారణకు బయల్దేరాలి. ఉదయం 11 దాటినా… కవిత కేసీఆర్ నివాసం నుంచి బయటికి రాలేదు. అయితే… ఈడీ పంపిన పైలట్ వాహనం మాత్రం కవిత నివాసం ముందే వుంది. ఎమ్మెల్సీ కవిత పంపిన ప్రతిపాదనను ఈడీ అనుమతిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.