భారత గణతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసి అన్నారు. రేపటి రిపబ్లిక్ దినోత్సవ పెరేడ్ కి గౌరవ అతిథిగా పాల్గొడానికి భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడుకి రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసిని రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికారు.
అనంతరం అయన సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇరు దేశాల మధ్య సుస్థిరమైన, సమతుల్యమైన మంచి సంబంధాలు ఉన్నాయని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసి చెప్పారు. రాబోయే రోజుల్లో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకుంటామని తెలిపారు. అంతకుముందు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసి మహాత్మ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
మరో వైపు ఈజిప్టు అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో విడివిడిగా సమావేశయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్ డొమైన్, వాణిజ్యంతో సమా వివిధ రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు మాట్లాడుతూ… 2015 లో న్యూయార్క్ వేదికగా ప్రధాని మోదీతో భేటీ అయ్యానని, అప్పట్లోనే మోదీపై తనకు అపారమైన విశ్వాసం కలిగిందని గుర్తు చేసుకున్నారు.
భారత్ ను మోదీ ముందుకు తీసుకెళ్లరన్న పరిపూర్ణ విశ్వాసం అప్పుడే కలిగిందన్నారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలం కావడానికి తాను మోదీని ఈజిప్టు పర్యటనకు ఆహ్వానించానని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలా ముందుకు సాగాలో చర్చించామని, అలాగే COP 27 గురించి కూడా చర్చించామని ఈజిప్ట్ అధ్యక్షుడు వెల్లడించారు. ఈజిప్ట్ మరియు భారతదేశం మధ్య భద్రతా సహకారం గురించి కూడా చర్చించామని, భారత్ పర్యటనకు రావడం చాలా ఆనందంగా వుందన్నారు.