పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి కుటుంబం బ్రాందీ షాపులు పెట్టుకునే వారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతాయుత పదవిలో వుంటూ రేవంత్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తమది ఉమ్మడి కుటుంబమని, తాము నిజాయితీగానే వున్నామని స్పష్టం చేశారు. ఇక… సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అంశంతో తనకు సంబంధం లేదని, ఆ విషయాన్ని ఆయన్నే అడగాలని అన్నారు.
34 సంవత్సరాలుగా కాంగ్రెస్ కూడా సర్వస్వం ధారబోశానని, అలాంటిది తనపై తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ ను హెచ్చరించారు. తాను ఎన్ఎస్ యూఐ లో వున్నప్పుడు రేవంత్ పుట్టారో లేదో కూడా తనకు తెలియదని ఎద్దేవా చేశారు. తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని, ఒక్క మాట అన్నా తాను పడనని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని సీజ్ చేయడాన్ని నిరసిస్తూ జరిగిన ధర్నాలో తానొక్కడినే పాల్గొన్నానని, రేవంత్, ఉత్తమ్ ఢిల్లీలోనే వుండి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పదవి ఇవ్వకున్నా… తాను కష్టపడి పనిచేస్తానని అన్నారు.