కాంగ్రెస్- బీఆర్ఎస్ కలవాల్సిందేనని, కలవక తప్పదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వచ్చేది హంగ్ అసెంబ్లీయేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాల్సిందేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60 సీట్లు రావాలని , అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. ఈ రెండు పార్టీలూ సెక్యులర్ పార్టీలని, అందుకే కేసీఆర్ కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారని వివరించారు. ఇక… కాంగ్రెస్ లో వివిధ కారణాల వల్ల సీనియర్లు ఒకే వేదికపైకి రాలేకపోతున్నారని అన్నారు. ఒంటరిగా మాత్రం పార్టీ అధికారంలోకి రాలేదని కుండబద్దలు కొట్టారు. తమ పార్టీ నేలంతా కలిసి కష్టపడితే… 40 సీట్లు వస్తాయన్నారు.
అయితే ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని అద్దంకి దయాకర్ అన్నారు. వరంగల్ సభ వేదిక ద్వారా రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పారన్నారు. వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అన్నారు. గతంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.