కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కాంగ్రెస్ కి మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తర్వాత చండూరు సభ వేదికగా ఆయన్ను కాంగ్రెస్ నేతలు తిట్టడం, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఇద్దరు సోదరులు భేటీ కావడం… వీటి వల్ల కాంగ్రెస్ తో ఆయనకు గ్యాప్ పెరిగినట్లు స్పష్టమైంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక విషయంపై మీడియాతో మాట్లాడిన మాటలను చూస్తుంటే… ఆయనకు, పార్టీకి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా వుంటానని, ప్రచారానికి తాను వెళ్లనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఉప ఎన్నిక కసరత్తుకు సంబంధించిన జరిగిన సమావేశానికి సంబంధించిన సమాచారం తనకు ఎవ్వరూ ఇవ్వలేదని మండిపడ్డారు. ఏ మీటింగ్ జరిగినా… తనకు పార్టీ సమాచారం ఇవ్వడం లేదని, ఆహ్వానం లేని సమావేశానికి తానెలా వెళ్తానని సూటిగా ప్రశ్నించారు.
అయితే.. చండూరు వేదికగా జరిగిన సభలో తనను కావాలనే కొందరు అలా బూతులు తిట్టించారని కోమటిరెడ్డి మండిపడ్డారు. దీని వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని, తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్నిక కంటే ముందే రేవంత్ చేతులెత్తేశారని, ఇదేం పద్ధతి? అంటూ ఫైర్ అయ్యారు. చండూరు వేదికగా తనను తిట్టిన తిట్టకు పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ కు టిక్కెట్ ఇచ్చి, సపోర్ట్ చేసింది కూడా తామేనని, అయినా.. తమనే తిడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.