కాంగ్రెస్ పార్టీలో తాను చురగ్గానే వున్నానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం కోమటిరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అయితే.. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి సూచించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లలో గెలుస్తుందని, ఎన్నికల ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని సామాజిక వర్గాల వారికీ టిక్కెట్లు ఇవ్వాలని, వివక్ష ఉండొద్దన్నారు. ఒక్కరితోనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. అయితే.. పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలంగాణ అంతటా పర్యటిస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.