భీమవరంలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు తాను హాజరు కావడం లేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి భీమవరం బయలుదేరిన ఆయన.. అర్ధాంతరంగా మధ్యలోనే వెనుదిరిగారు. లింగంపల్లిలో రైలెక్కిన ఎంపీ రఘురామ… బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. భీమవరంలో తన అనుచరులపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు.
సుమారు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, చిత్ర హింసలు పెడుతున్నారని ఆరోపించారు. వారి విషయంలో ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారని, తాను వెళ్తే ఇంకా రెచ్చిపోతారని పేర్కొన్నారు. తాను భీమవరానికి వెళ్లకపోతే వదిలేస్తామని వారితో పోలీసులు అన్నారని, తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నట్లు ఎంపీ రఘురామ పేర్కొన్నారు.
భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైనప్పటి నుంచి స్థానిక ఎంపీ రఘురామ వస్తారా? రారా? అన్న ఉత్కంఠ సాగింది. ఈ విషయంపై ఆయన హైకోర్గును కూడా ఆశ్రయించారు. తనను అడ్డుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. చట్టం ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది.