పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే.. అరెస్ట్ ను ఈడీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మనీలాండరింగ్ కేసు విషయంలో ఈడీ ఆదివారం ఉదయం నుంచి రౌత్ ఇంట్లో సోదాలు చేసి, ఆయన్ను సుదీర్ఘంగా విచారణ చేసింది. చివరకు ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే.. తాను పార్టీ మారనని, కేంద్రానికి తలొగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఇక… పత్రాచాల్ మనీలాండరింగ్ విషయంలో విచారణకు హాజరవ్వాలని ఈడీ రౌత్ కు ఇప్పటికే 2 సార్లు నోటీసులిచ్చింది. అయితే.. పార్లమెంట్ సమావేశాల కారణంగా హాజరు కాలేనని ప్రకటించారు. దీంతో ఈడీయే హఠాత్తుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచే రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన్ను విచారించారు. పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. అయితే.. తాను తప్పు చేయలేదని, శివసేనను వీడేది లేదని తెగేసి చెప్పారు. తనకు ఎలాంటి భూ కుంభకోణంతో సంబంధంలేదని, బాలా సాహెబ్ పై ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు.