కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే.. నఖ్వీని ఉప రాష్టపతి అభ్యర్థిగా ఎన్డీయే బరిలోకి దింపుతుందన్న వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా నఖ్వీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీ బరిలోకి దిగుతున్నారని ఖాయమైందని కొందరు పేర్కొంటున్నారు. ఇక.. ఉప రాష్ట్రపతి పదవికి తాజాగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఈ పదవి ఎవరికి దక్కుతుందని చూడాలి.