మునుగోడు హీట్ మరింత రాజుకుంది. ఇవ్వాళ అధికార టీఆర్ఎస్ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ మునుగోడుకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా మునుగోడుకు చేరుకుంటారు. 4 వేల కార్లతో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. మరో వైపు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్- విజయవాడ 65 వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మునుగోడు సభ సందర్భంగా 1300 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీగా జన సమీకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ద్వారా పార్టీ పటిష్ఠంగా వుందన్న సంకేతాలను ఇవ్వనున్నారు. ఇందుకు గాను పార్టీ భారీ జన సమీకరణ చేయాలని నిమగ్నమైంది. అంతేకాకుండా ఇన్ ఛార్జీలను కూడా నియమించింది. టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాయి. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ రేమ రాజేశ్వరి సభాస్థలి వద్ద పనులు పరిశీలించారు. సభను సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ ఇన్ చార్జీలను నియమించారు.