15 వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ముర్ము 64 శాతం ఓట్లు సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో వుండే ఎలక్ర్టోరల్ కాలేజీలో ఆమెకు 6,76,803 ఓట్లు దక్కాయి. దీంతో రిట్నరింగ్ అధికారి పీసీ మోదీ అధికారికంగా ముర్ము విజయాన్ని ప్రకటించారు. ఇక… ప్రత్యర్థి, విపక్ష నేతల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. తొలి రౌండ్ లో లోకసభ, రాజ్యసభ ఎంపీల ఓట్లు లెక్కించారు. తర్వాత అక్షరమాల క్రమంలో రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించారు. ముర్ముకు 53 శాతం ఓట్లు పడినట్లు మూడో రౌండ్ లోనే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు.
తొలి రౌండ్ లో ఎంపీల ఓట్లు లెక్కించారు. 748 మంది ఓటేయగా ఇందులో 540 మంది ఓట్లు ముర్ముకు పడ్డాయి. వీటి విలువ 5,23,600. అంటే… 72 శాతం మంది ముర్ముకే వేశారు. ఇక.. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లవని రిట్నరింగ్ అధికారి ప్రకటించారు. ఏపీ నుంచి ముర్ముకు అత్యధికంగా ఓట్లు పడ్డాయి.. బెంగాల్, తమిళనాడు నుంచి యశ్వంత్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక ద్రౌపది ముర్ము విజయం ఖాయమవగానే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు.. ఇతర పార్టీల నుంచి ఆమెకు శుభాకాంక్షలు ప్రకటించారు. 15 వ రాష్ట్రపతిగా ముర్ము ఈ నెల 25 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.