భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాలు లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి 29 మంది మీడియా అధిపతులను, 79 మంది ఫొటోగ్రాఫర్లు, టీవీ కెమెరామెన్లను ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 8:30 నిమిషాల ప్రాంతంలో ముర్ము రాజ్ ఘాట్ కి వెళ్లి, గాంధీకి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి తన తాత్కాలిక నివాసానికి వెళ్తారు. నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు.
ఇక… పార్లమెంట్ భవనం నుంచి మర్యాద పూర్వకంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లో్కసభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ముర్మును ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్ కు తీసుకెళ్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత గౌరవ సూచకంగా 21 సార్లు గన్ సెల్యూట్ చేయనున్నారు. దీనితో ఇక.. అధికారికంగా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తన కార్యకలాపాలను మొదలుపెట్టనున్నారు.