దేశంలోని పేదలు కలలు కనడమే కాకుండా, తమ కలలను సాకారం కూడా చేసుకోవచ్చనడానికి తన నామినేషనే ప్రత్యక్ష ఉదాహరణ అని భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అత్యున్నత పదవికి తనను ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. భారత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రతిభా పాటిల్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ముర్ము తన తొలి ప్రసంగం చేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు సంపూర్ణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల వేళ… రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా వుందన్నారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ… తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, స్వతంత్ర భారతంలో పుట్టి, రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిని తాను అని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సమరయోధులు కలలుగన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం వుందని ముర్ము సూచించారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదని, వార్డు స్థాయి నుంచి తాను రాష్ట్రపతి పదవికి చేరుకున్నానని తెలిపారు.
అత్యున్నత పీఠమైన రాష్ఠ్రపతి పీఠం వరకూ చేరుకోవడం అనేది తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పేద వ్యక్తిది కూడా ఈ విజయమని అభివర్ణించారు. అందరి మద్దతుతో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తానని ప్రకటించారు. ఒడిశాలోని ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి తాను వచ్చానని, ఆ నేపథ్యం నుంచి వచ్చి, దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా వుందన్నారు. అలాంటి స్థాయి నుంచి ఇక్కడి వరకూ రాగలిగానని పేర్కొన్నారు.
సబ్ కా ప్రయాస్- సబ్ కా కర్తవ్య్ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. డెవలప్ మెంట్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని, దేశ ప్రజలకు స్థిరమైన జీవన విధానం ఎంతో అవసరం వుందన్నారు. దేశ యువత కేవలం తమ భవిష్యత్తు మీదనే కాకుండా దేశ పురోగతి వైపు కూడా ఆలోచించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశ ప్రథమ పౌరురాలిగా ఆ పథంలో పయనించే యువతకు తన మద్దతు ఎప్పటికీ వుంటుందని ఆమె హామీ ఇచ్చారు.