నాగాలాండ్, మేఘాలయాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు వరకూ మేఘాలయాలో 63.9 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక.. నాగాలాండ్ లో సాయంత్రం 3 గంటల వరకూ 72.99 శాతంగా ఓటింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇక… ఓటర్లు ఇరు రాష్ట్రాల్లోనూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేఘాలయ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ ప్రింగ్రోప్ షిల్లాంగ్ లోని తన నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక.. మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్మా తురా పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక రెండు రాష్ట్రాల్లో 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 34 లక్షలకు పైగా ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… నాగాలాండ్ లో మొత్తం 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మేఘాలయలో 119 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎలక్షన్ కమిషన్ మోహరించింది. 900 పోలింగ్స్టేషన్లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. మార్చి 2న ఫలితాలు విడుదలయ్యే వరకు మేఘాలయ– బంగ్లాదేశ్ బార్డర్ ను మూసేయాలని ఈసీ ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని బార్డర్ ఏరియాల్లో అధికార యంత్రాంగం సీఆర్పీసీ 144 సెక్షన్ను విధించింది.
మరోవైపు మేఘాలయ ఎన్నికల అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ఓటేసిన 5 గురు వ్యక్తులకు మెమెంటోలను అందజేశారు. ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహించడంలో భాగంగానే తాము ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చామని అధికారులు వివరించారు. ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.