ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కులన్నీ లాక్కున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించిన జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును సైతం హరించారని విమర్శించారు. న్యాయ స్థానాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, పత్రికలు.. ఇలా అన్ని వ్యవస్థలనూ నియంత్రించారని అప్పటి కాంగ్రెస్ సర్కార్ పై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
నాకు ఇంకా గుర్తుంది. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి నిరాకరించడంతో ఆయనపై నిషేధం ప్రకటించారు. దీంతో ఆయన్ని రేడియోల్లో ప్రవేశానికి కూడా నిరాకరించారు. అయితే ఎన్నో అరెస్టులు, వేలాది మందిపై దౌర్జన్యాలు జరిగినా.. ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం మాత్రం సడలలేదు అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.
మనకు విదేశీ పాలన నుంచి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ భయంకర ఎమర్జెన్సీ చీకటి కాలాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని మోదీ అన్నారు. శతాబ్దాలుగా మనలో పాతుకుపోయిన ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి చివరకు విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఎమర్జెన్సీ నాటి రోజులను మరిచిపోవద్దని, భవిష్యత్ తరాలు కూడా మరవొద్దని మోదీ సూచించారు.