బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 న విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు గవర్నర్ గౌరవాన్ని కించపరిచేలా వున్నాయని తెలిపింది.
ఈ నెల 21 న విచారణకు హాజరవ్వాలని, లేదంటే… తదుపరి చర్యలకు తాము సిద్ధమవుతామని తేల్చి చెప్పింది. శాసనసభ, శాసన మండలి ఆమోదించిన బిల్లుల ఫైళ్లను గవర్నర్ తమిళిసై ఎందుకు క్లియర్ చేయరని ప్రశ్నిస్తూ… ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి, నోటీసులు పంపింది.
కొన్నిరోజుల క్రితం హుజురాబాద్ లోని జమ్మికుంటలో నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిలదీశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటి దాకా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వాడారు. ఈ వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారం రేపాయి. బీజేపీ నేతలు కౌశిక్ రెడ్డిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.