విపక్ష పార్టీలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారు. రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరేట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. 17 పార్టీలు మార్గరేట్ ఆల్వా ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొన్నారు. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే.. ఈ విషయంపై మార్గరేట్ ఆల్వా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తానని తెలిపారు. విపక్షాల ఉమ్మడి నిర్ణయాన్ని ఎంతో గౌరవిస్తున్నానని తెలిపారు. తన పట్ల విశ్వాసం వుంచిన వారందరికీ ఆమె ధన్యవాదాలు ప్రకటించారు.
కాంగ్రెస్ లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. గతంలో మార్గరేట్ ఆల్వా 4 రాష్ఠ్రాలకు గవర్నర్ గా వ్యవహరించారు. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్ గా వున్నారు. అంతకు పూర్వం ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మార్గరేట్ ఆల్వా స్వస్థలం కర్నాటక. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. 1969 లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ లో రకరకాల హోదాల్లో పనిచేశారు. 1980, 86, 1992 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2004 లో బరిలోకి దిగి, ఓడిపోయారు.