ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు.ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది. లెక్కింపు పూర్తైన అనంతరం ఉప రాష్ట్రపతిగా ధన్కర్ ఎన్నికైనట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభకు చెందిన మొత్తం 780 ఎంపీలకు ఓటు హక్కు ఉండగా 725 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 92.94శాతం మంది ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. .ప్రధాని నరేంద్ర మోదీ జగదీప్ ధన్కర్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జగదీప్ ధన్కర్ కు అభినందనలు తెలిపారు. ఇక… ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్ ఆల్వా కూడా ధన్కర్ కు అభినందనలు తెలిపారు.
ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో ఓబీసీ వర్గానికి (జాట్) చెందిన కుటుంబంలో.. గోఖల్ చంద్, కేసరి దేవి దంపతులకు జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(జేడీ) తరఫున ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్రమంత్రి(పార్లమెంటరీ వ్యవహారాలు)గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. 1993-98 మధ్య అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2008లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 నుంచి.. ఈ ఎన్నిక వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగారు.