గ్యాంగ్ స్టర్లపై NIA ఉక్కుపాదం మోపింది. వీరిని టార్గెట్ చేసుకుంటూ దేశ వ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఒక్క పంజాబ్ లోనే 30 చోట్ల NIA దాడులు చేసింది. ఫిలిబిత్ కేంద్రంగా అక్రమంగా ఆయుధాలను గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారని ఎన్ఐఏ సోదాల్లో తేలింది. అక్రమ ఆయుధాలు పాకిస్థాన్ దేశం నుంచి వచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానాలకు చెందిన ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకొని వారిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో గ్యాంగ్‌స్టర్లు ఏకంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, నేరాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏకి సమాచారం అందింది. ఇందులో భాగంగా ఇది వరకే అరెస్ట్ అయిన వారిని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులోనే ఎన్ఐఏకి పలు విషయాలు తెలిశాయి. వీటి ఆధారంగా దేశ వ్యాప్తంగా దాడులు చేస్తోంది.