ఏపీలోని మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేసింది. ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఈ సోదాలు చేసింది. విజయవాడలో కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, జన నాట్యమండలి నాయకుడు డప్పు రమేశ్ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇక.. ప్రకాశం జిల్లాలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది. ఉదయం 5:30 నుంచి రాత్రి వరకూ ఈ సోదాలు జరిగాయి. వీరందరూ మావోయిస్టు రిక్రూట్ మెంట్ కు సహకరిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఎన్ఐఏ స్వాదీనం చేసుకుంది.
అయితే.. ఎన్ఐఏ సోదాలు చేసే సమయంలో ఆర్కే భార్య శిరీష నివాసంలో లేరు. ఇంటికి తాళం వేసింది. తహశీల్దారు, వీఆర్ఏ సమక్షంలో ఎన్ఐఏ అధికారులు ఇంటి తాళాలను పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లారు. సాయంత్రం వరకూ తనిఖీలు నిర్వహించారు. తన భర్త ఆర్కే చనిపోయిన తర్వాత తాను టైలరింగ్ చేసుకుంటున్నానని, అయినా తన ఇంట్లో సోదాలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇక దుడ్డు ప్రభాకర్ ఇంటి సోదాల్లో ఆయన సెల్ ఫోన్, పుస్తకాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఆ తర్వాత పలు కాగితాలను, ఆ ఫోన్ ను తీసుకెళ్లారు.