భారత దేశ రూపాయి విలువ పడిపోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమెరికన్ డాలర్ తో పోల్చితే మన రూపాయి తగ్గినట్లు కనిపిస్తోందని, కానీ… ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే.. మన రూపాయి చాలా మెరుగ్గానే వుందని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ పై విధంగా ప్రకటించారు.
మన కరెన్సీని ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తూనే వుందని, అవసరమైతే జోక్యం కూడా చేసుకుంటోందని వెల్లడించారు. రూపాయిని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ, ఆర్థిక శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని సభకు వివరించారు. ఇక.. విదేశీ మారక నిల్వలపై కూడా స్పందించారు. ఈ నెల 22 నాటికి 571 బిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు నిల్వలున్నాయని, ఇదేమీ తక్కువ కాదన్నారు. భారత్ ఇప్పటికీ సురక్షిత స్థానంలోనే వుందని మంత్రి ప్రకటించారు.