ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన కామెంట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్షాన్ని హేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. అలా మాట్లాడటం దేశ ప్రజలను అవమానించడేమని అన్నారు. హైదరాబాద్ వేదికగా దూరదర్శన్ కేంద్ర బడ్జెట్ పై చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అన్న భావంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యంపై జోకులు వేయవద్దని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మెరుగైన ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యంపై జోకులు వేయవద్దని అడుగుతున్నా. ఇలా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అని పేర్కొన్నారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ తమ వంతులుగా భాగస్వాములు కావాల్సి వుందన్నారు.
అప్పులపై కేంద్రాన్ని విమర్శిస్తున్న వారు రాష్ట్ర అప్పుల సంగతేమిటో చెప్పాలని నిర్మలా సీతారామన్ అన్నారు. 2014 లో తెలంగాణ అప్పులు 60 వేల కోట్లు వుండగా… ఇప్పుడు 3 లక్షల కోట్లు దాటిపోయిందన్నారు. రాష్ట్రంలో రెండు సార్లు ఇదే ప్రభుత్వం అధికారంలో వుందని, అలాంటప్పుడు 8 సంవత్సరాల్లో అప్పు ఎలా పెరిగిందో చెప్పాలన్నారు.2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయని నిర్మల వివరించారు.
తెలంగాణలో మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపమంటే పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్ పేర్లనే కేంద్రానికి పంపించారని.. అందుకే వాటిని తిరస్కరించామని చెప్పారు. తెలంగాణలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా కేసీఆర్‌కి తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన డేటా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు నో డేటా అవైలబుల్ అని ఎవరికి వర్తిస్తుందో ఆలోచించుకోమన్నారు.