ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. అయితే.. తెలంగాణ సీఎం, బిహార్ సీఎంలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటాను పెంచాలని సీఎం భూపేశ్ బాఘేల్ సూచించారు. 20,000 కంటే తక్కువ జనాభా వున్న నగరాల సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ఇక.. నీతి ఆయోగ్ అంబుడ్స్ మెన్ పాత్ర వహించాలని, కేంద్ర పథకాల అమలులో కేంద్రం, రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించాలని సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు.