ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఏపీలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ లో గడ్కరీ ప్రసంగించారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమన్నారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా వుందన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా వుందని ఈ వేదిక ద్వారా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ పోర్ట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం పోర్ట్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించడానికి అనుమతులను మంజూరు చేస్తోన్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. భోగాపురంలో ఏర్పాటు కాబోతోన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు అనుసంధానించేలా ఈ విశాఖపట్నం పోర్ట్ హైవేను ఆరులేన్లుగా విస్తరిస్తామని అన్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిని భోగాపురం వద్ద 6,300 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు.