బిహార్ లో మహా ఘట్ బంధన్ ప్రభుత్వం నెలకొంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తేజస్వీకి సీఎం నితీశ్ అభినందనలు తెలిపారు. అయితే… ఈ సమయంలో తేజస్వీ సీఎం నితీశ్ పాదాలను తాకడానికి ప్రయత్నించగా…. వారించి, నమస్కారం మాత్రమే చేశారు. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్ తల్లి రబ్రీదేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా హాజరయ్యారు. ఇక… తాజా రాజకీయ పరిస్థితులపై లాలూ ప్రసాదవ్ తేజస్వీ యాదవ్ తో ఫోన్లో చర్చించారు. మరోవైపు సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ చేశారు. రాజకీయ పరిస్థితులను పూర్తిగా వివరించారు. అయితే.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు లాలూ అభినందనలు తెలిపారు.
సీఎం నితీశ్ కుమార్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కి అందజేశారు. ఆ తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో భేటీ అయ్యారు. చర్చలు జరిపారు. అంతకు ముందు సీఎం నితీశ్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఎన్డీయే నుంచి బయటికి రావాలని భావిస్తున్నానని వారితో వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయాధికారం నితీశ్ దే అంటూ నేతలందరూ స్పష్టం చేశారు. దీంతో సీఎం నితీశ్ నేరుగా రాజ్ భవన్ వెళ్లి, రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత తేజస్వీతో కలిసి మళ్లీ రాజ్ భవన్ కు వెళ్లి, తనకు మద్దతిస్తున్న 164 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు.