జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు, జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు ఇలాగే కురుస్తాయని, వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలని, సెలవులను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటలూ నిరంతరం అప్రమత్తంగానే వుండాలని తెలంగాణ మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైద్రాబాద్ లో గడచిన 24 గంటల్లో తేలికపాటి జల్లులు పడ్డాయని అధికారులు తెలిపారు.
వర్షాల కారణంగా సిటీ అతలాకుతలమైంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు గుంతలు పడ్డాయి. భారీ వర్సాల కారణంగా కరెంట్ వైర్లు కూడా తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో బుధవారం నాటికి 7.51 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీహెచ్ ఎంసీ సిబ్బంది నిత్యం అందుబాటులో వుండాలని, ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుండాలని మున్సిపల్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.