దేశ అవసరాలకు సరిపడా నిల్వలు వున్నందున గోధుమలను దిగుమతి చేసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశ అవసరాలు తీర్చడానికి సరిపడా ధాన్యం వుందని అందుకని, దిగుమతి చేసుకోమని ఆహార మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవచ్చని వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. ఈసారి మనదేశంలో గోధుమల ఉత్పత్తి దాదాపు 3 శాతం తగ్గి 106.84 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా.
మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 2021–-22 పంట సంవత్సరంలో రికార్డు స్థాయిలో 315.72 మిలియన్ టన్నులకు చేరుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో వేడిగాలుల వల్ల గోధుమ ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2021–22 పంట సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన అంచనాల ప్రకారం, వరి, మొక్కజొన్న, శనగలు, పప్పుధాన్యాలు, ఆవాలు, నూనెగింజలు, చెరకు రికార్డు స్థాయిలో పండుతాయి.