Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఓంకారమే ఆత్మరూపం – శబ్ద రూపం

మన సృష్టి ప్రారంభం మరియు మన మనుగడ ఇదే..!
మహావిస్పోటనం (బిగ్ బ్యాంగ్) జరిగినప్పుడు ఓ శబ్దం ఆవిర్భవించిందని ఎందరో శాస్త్రవేత్తలు నిర్ధారించారు..
ఆ శబ్దం “ఓం” అనే శబ్దంతో మొదలైందని ఎన్నో రుజువులు ఇప్పటికే వున్నాయి..
సృష్టి ఆవిర్భావం “ఓం” అనే ప్రణవనాదముతో మొదలైందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
ప్రపంచాన్ని ఒక శబ్దం ద్వారా సూచించాలి అంటే ఆ శబ్దము ఓంకారమే.!
ఏదైనా ఒక వస్తువుగురించి చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ఎంతవర్ణించినా ఒక్కోసారి దాని స్వరూపం మనకు అర్ధం కాదు.. అదే మనం దానిపేరు కనుక చెప్పినట్లయితే తేలికగా అర్ధమవుతుంది .. ఉదాహరణకు ఆవు .. దీన్ని వర్ణించి చెప్పేదానికన్నా దాని పేరు చెప్తే తేలికగా తెలుస్తుంది.. అలాగే ఈ జగత్తుకు అతీతమైనదాన్ని త్రికాలాతీతమైనదాన్ని గురించి తెలుసుకోవడానికి దానికి పెట్టిన పేరే ఈ ఓంకారము.. ఇది సమస్త కాలములకు, జగత్తుకూ ప్రతీక.. భగవంతుని దృశ్యరూపం ఈ విశ్వము అయితే.. శబ్ద రూపం మాత్రం ఓంకారమే.
ఉపనిషత్తులు ప్రకారం..
కనిపించే ఈ జగత్తంతా పరబ్రహ్మస్వరూపమే.. అంటే పైకి కనిపించేది.. కనిపించనిది కూడా బ్రహ్మమే అని అర్ధం .. ఆత్మకు నాలుగు పాదాలు వున్నాయి.. అందులో మొదటిది “వైశ్వానరుడు” దానర్ధం విశ్వంలోని నరులందరిలో సమానుడు అని.. వారందరి ప్రతినిధి. జాగ్రదావస్థ ఇతని స్థానం. బాహ్య విషయాలను మాత్రమే ఇతను గ్రహిస్తాడు.. తేలికగా చెప్పాలంటే మన జీవాత్మయే ఈ వైశ్వానరుడు.. ఇతడికి ఏడు అంగములు, పంతొమ్మిది నోళ్ళూ ఉంటాయి.
అంగములను సప్తాంగములని కూడా అంటారు.
స్వరము అనగా శిరస్సు
సూర్యుడు అనగా కన్ను
వాయువు అనగా ప్రాణం
ఆకాశం అనగా శరీరం
జలం అనగా మూత్రస్థానం
భూమి అనగా పాదాలు
ఆహవనీయాగ్ని అనగా నోరు
అలాగే పంతొమ్మిది నోళ్ళు అనగా
జ్ఞానేంద్రియాలు ఐదు (అందరికీ తెలిసినవే)
కర్మేంద్రియాలు – ఐదు
పంచ ప్రాణాలు – ఐదు
అంతఃకరణ చతుష్టయము అనగా మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము ఇవి నాలుగు.
వీటన్నిటి ద్వారానే ఇతడు బాహ్యజగత్తును అనుభవిస్తాడు..
ఇక రెండవది “తైజసుడు” దీన్నే తేజోవంతుడు, లేదా మానసిక స్థితి అంటారు.. స్వప్నావస్థ ఇతని సంచార స్థానం.. కలలో చూచే విషయాలు గ్రహిస్తాడు కాబట్టే అంతర్ముఖమైన చేతన గలవాడు.. ఇతనికి కూడా పైన చెప్పినవే ఉంటాయి కాకపోతే వైశ్వానరుడు స్థూలవిషయాలను అనుభవిస్తే ఇతడు సూక్ష్మ విషయాలను అనుభవిస్తాడు..
నిద్రించినప్పుడు ఏ కోరికలు లేని స్థితిని సుషుప్తి అంటారు అదే గాఢనిద్ర .. సుషుప్తావస్థలో సంచరించే ప్రాజ్ఞుడే ఆత్మ యొక్క మూడవ పాదం.. అంటే “ప్రాజ్ఞుడు”.. ఈ స్థితిలో భేదభావాలు వుండవు.
ఇక నాల్గవది తురీయ రూపం .. ఇది కంటికి కనిపించదు.. శాంతి స్వరూపము.. అదే భగవంతుని రూపం.. ఆనందమయం.. అద్వైతం.. అలాంటి ఆత్మను గురించే తెలుసుకోవాలి.. ఓంకారమే ఆత్మ రూపం.. ఆత్మ అక్షరాన్ని ఆశ్రయించినప్డు ఓం అనే ఆత్మను ఒక శబ్దంగా చెప్పినప్పుడు ఆత్మతో తాదాత్మ్యం పొందుతుంది.. ఓంకారాన్ని కనుక అకార ఉకార మకారాలుగా విభజిస్తే, అవే ఆత్మయొక్క పాదాలు.
ఏ ఉపనిషత్తు అయినా తనంతట తానుగా, మనకు ఇష్టం ఉన్నా, లేకున్నా బలవంతంగా మనలను ఈడ్చుకువెళ్ళి పరమాత్మ సన్నిధికి చేర్చదు .. ఎవరైతే ప్రపంచంలో తిరుగుతూ వారి వారి వాసనల కనుగుణంగా వ్యవహరిస్తూ, సుఖ, దుఃఖాలను పొందుతూ . ఏదో ఒక నాటికి నిత్యమైనదేమిటో – అనిత్యమైన దేమిటో తెలుసుకొని, అనిత్యమైన ప్రాపంచిక విషయాలపట్ల, భోగాలపట్ల, వైరాగ్యం చెంది, నిత్యమైన, శాశ్వితమైన, ఆనంద స్వరూపమైన పరమాత్మ పట్ల ఆసక్తికలిగి, ఆ పరమాత్మ కొరకు తపిస్తూ,
సాధనలు చేస్తారో అట్టి వారినే ఉపనిషత్తులు పరమాత్మ సన్నిధికి చేర్చేది. సాధనలు అంటే ఏదో ఠాలాఠోలీ సాధనలు కాదు.. ఏదో చేశామంటే చేశామనే రకం కాదు.. చేసి చేతులు దులిపేసుకోవడం కానే కాదు..
పైవిషయాలను నమ్మడం, నమ్మకపోవడం అనేది మీ ఇష్టం..
కాని ఇది శాస్త్రం.. ఇదే ధర్మం.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates