ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రస్తుతమున్న నియామక వ్యవస్థను రద్దు చేసింది. దీని స్థానే ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా వున్న కమిటీనే చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది.
ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే… ప్రతిపక్ష నేత లేకపోతే మాత్రం.. విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో వుండాలని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకాల విషయంలో ఓ వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. జస్టిస్ కె.ఎం. జోసెఫ్ సారథ్యంలోని ధర్మాసనం పై తీర్పునిచ్చింది.