తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ఫాలుంటాయని, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా వుండాలని సూచించింది. ఇక… హైదరాబాద్ లో నేటి ఉదయం నుంచి ముసురు వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మలకపేట్, కోఠి ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 రోజుల పాటు సిటీలో వర్షాలుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక… ఏపీలోనూ తీవ్ర వర్షాలే కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది.