అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వంకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన్ను పార్టీ నుంచి పళని స్వామి బహిష్కరించారు. ఇక.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వ నుంచి పన్నీర్ సెల్వం కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈయనతో పాటు మరో 16 మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ పళని స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా మూకుమ్మడిగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పళని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ తేనీ నియోజకవర్గం నుంచి ఎంపీగా వున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లపై కూడా వేటు వేశారు. ఇక.. కేవలం రవీంద్రనాథ్ పైనే కాకుండా, పన్నీర్ మరో ఇద్దరు కుమారులైన జయప్రదీప్, నటరాజన్ ను కూడా పళని స్వామి బయటకు పంపించేశారు. మరోవైపు కొన్ని రోజుల్లోనే పన్నీర్ సెల్వం శశికళతో భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఉత్కంఠ నెలకొంది.