తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగే సాలకట్ల పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం.
పవిత్రోత్సవాలు సందర్భంగా తొలిరోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి.