తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు, పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల పైనా బాబు, పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చేశారు. దీంతో పవన్ కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్, ఈ విధంగా ఒకరికొకరు కలుసుకుని సంఘీభావం తెలుపుకుంటున్నారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపైనే అందరి కళ్లు ఉన్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీరు భేటీ కాగా తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
