రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, మార్పు కోసమే వచ్చామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏ ఒక్కరినీ శత్రువులుగా పరిగణించమని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్ కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున 173 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాయల సీమ చదువుల నేల అని… పద్యం పుట్టిన నేల అని, పద్యం పుట్టిన నేలలో నేడు మద్యం ప్రవహిస్తోందంటూ మండిపడ్డారు. ఇంటింటికీ లిక్కర్ వచ్చి చేరిందన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా… జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటి వరకూ కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు.
ఏపీ భవిష్యత్తు కోసం పోరాడడానికి తాము సిద్దంగా వున్నామని, దెబ్బలు తినడానికి కూడా సిద్ధమేనని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. రాయలసీమను ఏ ముఖ్యమంత్రీ డెవలప్ చేయని రీతిలో డెవలప్ చేస్తామని, మార్పు కోసమే జనసేన వుందని ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీలో కీలకంగా వున్న నేతలే… అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేలా చేశారంటూ మండిపడ్డారు. ఆ పార్టీ ఇప్పుడు వుండి వుంటే… ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.