కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేసి, బంగాళాఖాతంలో కలిపేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ధరణి పోర్టల్ రద్దయ్యేంత వరకూ తాము పోరాటం చేస్తూనే వుంటామని ప్రకటించారు. ధరణిని రద్దు చేసి, రెవెన్యూ రికార్డులను ప్రజల వద్ద వుంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించాలన్నారు.
విలువైన కోట్లాది రూపాయల భూముల్ని టీఆర్ఎస్ సర్కార్ కొల్లగొడుతోందని, ధరణి సర్వరోగ నివారిణి ఎంత మాత్రమూ కాదని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని, ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేర్లతో భూ సమస్యలను తెస్తోందని మండిపడ్డారు. ఎప్పుడో భూములు అమ్ముకున్న వారి పేర్లు కూడా ధరణిలో మళ్లీ కనబడుతున్నాయని, ప్రభుత్వం చేసే తప్పులకు సామాన్యులకు బలౌతున్నారని ఆక్షేపించారు.
ఓయూ భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతమని టీఆర్ఎస్ చెబుతోందని, నిమ్మజ్ లోని 512 ఎకరాల మాటేంటని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. భూముల కోసమే తెలంగాణ గడ్డపై విప్లవం వచ్చిందని, చాకలి ఐలమ్మ పోరాటం వచ్చిందని రేవంత్ గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.