జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహా లక్ష్మీ (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో కుమారుడు జీవీ నరసింహా రావు ఇంట్లో గురువారం ఆమె కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సీతా మహాలక్ష్మీ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆమె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆమెను సత్కరించాల్సి వుంది. కానీ.. ఈ లోపే ఆమె కన్నుమూశారు. ఇక… జాతీయ జెండా రూపొందించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా గతేడాదే సీఎం జగన్ స్వయంగా మాచర్ల వెళ్లి, సీతామహాలక్ష్మిని సత్కరించారు. ఆమెతో చాల సేపు ఆప్యాయంగా ముచ్చటించారు కూడా.