గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ పరిధిలో అధికార టీఆర్ ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఖైరతాబాద్ కార్పొరేటర్, దివంగత పీజేఆర్ కుమార్తె కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆమె టీఆర్ ఎస్ వీడుతున్నారన్న సంకేతాలు వచ్చేశాయి.
ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి పీజేఆర్ సీఎల్పీ నేతగా కాంగ్రెస్ లో వుండి.. పార్టీలోనే మరణించారన్నారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని ఆమె ప్రకటించారు. తమ కుటుంబం ముందు నుంచి కూడా కాంగ్రెస్ తోనే వుందని, కాంగ్రెస్ తో వుంటేనే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నెల 23 న కాంగ్రెస్ లో చేరుతున్నానని, తండ్రి పీజేఆర్ బాటలోనే నడుస్తానని విజయారెడ్డి అన్నారు.