దేశంలో కాళీమాతను వివాదాస్పదంగా చిత్రించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై కాళీమాత ఆశీస్సులు పుష్కలంగా వున్నాయన్నారు. కాళీ మాత శక్తితో విశ్వ కల్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని చెప్పుకొచ్చారు. తన ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మస్థానంద శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్నించారు.
ఈ సందర్భంగా స్వామి ఆత్మస్థానందతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశీస్సులు లభించడం తన సౌభాగ్యమని హర్షం వ్యక్తం చేశారు. ఆయన చివరి రోజుల్లో తాను ఆయన వద్దే వున్నానన్నారు. పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానానంద… స్వామి ఆత్మస్థానందకు మంత్ర దీక్ష ఇచ్చారని ప్రధాని తెలిపారు.
భారత్ లో అనాదిగా సన్యాసాశ్రమం వుందని, ఈ మార్గం ద్వారా సాధు సన్యాసులు లోక కల్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని మోదీ అన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ అన్న పవిత్ర సంప్రదాయాన్ని వారు పాటించారని ప్రధాని మోదీ వివరించారు.