సులభతర వాణిజ్యం ఎలాగైతే వుందో… అలాగే సులభమైన న్యాయ ప్రక్రియ కూడా వుండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన వేదిక అని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చాలా ఏళ్లుగా జైళ్లల్లో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ప్రధానిమోదీ మరోమారు సూచించారు. జిల్లా జడ్జీలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. న్యాయ వ్యవస్థ తలుపు తట్టే అవకాశం అందరికీ అందుబాటులో వుండటం ఎంత ముఖ్యమో… న్యాయం సత్వరమే అందడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించిందని, న్యాయ ప్రక్రియలో సాంకేతికతను మరింతగా వాడుకోవాలన్నారు.
ఇక… ఈ సమాజంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా ప్రసంగించారు. భారత్ లో జిల్లా కోర్టులో న్యాయ వ్యవస్థకు వెన్నె ముక అని పేర్కొన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు దొరికే న్యాయాన్ని బట్టే.. వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందని వివరించారు. అందువల్ల జిల్లా న్యాయాధికారులు కీలక పాత్ర పోషించాలని, జిల్లా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. న్యాయం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమని, మన రాజ్యాంగ పీఠిక చెప్పిందని కూడా గుర్తు చేశారు. ఇప్పటికీ… అతి కొద్ది మంది మాత్రమే న్యాయ వ్యవస్థను చేరుకోగలుగుతున్నాని, అవగాహన, ఆర్థిక స్థోమత లేక చాలా మంది అలాగే వుండిపోతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.