వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్జీలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం, బిహార్ సీఎం గైర్హాజర్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు.నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు.కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని ప్రధాని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తితోనే కరోనాపై విజయం సాధించి, ప్రపంచంలో సెహభాష్ అని పించుకున్నామని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.