కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎనలేని ప్రేమ పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో చేస్తోందని, నిరంతరం కృషి చేస్తూనే వున్నామన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తున్నామని, తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ధ్యేయమని వివరించారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై జనం నమ్మకం వుంచారని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. జన్ ధన్ ద్వారా దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. అందులో కోటికిపైగా జన్ ధన్ అకౌంట్లు తెలంగాణవేనని చెప్పారు.
ముద్ర, స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఇచ్చిన లోన్లలోనూ మహిళలకే పెద్దపీట వేశామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటుకు తాము ఎంతో కాలంగా కృషి చేస్తున్నామని, అలాంటి సైన్స్ సెంటర్ ఒకటి ఇప్పటికే సిద్ధమైందన్నారు. తెలంగాణలో 35 వేల కోట్ల విలువైన 5 బారీ సాగునీటి ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయన్నారు.
టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం..
తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయని ప్రధాని అన్నారు. ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా వుందన్నారు. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర పెంచామని, రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించామని గుర్తు చేవారు. భాగ్యనగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు.