ప్రధాని నరేంద్ర మోదీ నాగాలాండ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారతాన్ని పాలించేవారని విమర్శించారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకూ వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని, తమ ప్రభుత్వం మాత్రం ప్రగతి, శాంతి, పురోగతి, శ్రేయస్సు అన్న మంత్రాలతో ముందుకు సాగుతోందని వివరించారు. కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా చూసేదని, తాము మాత్రం 8 రాష్ట్రాలను అష్టలక్ష్మీలా చూసుకుంటున్నామని పేర్కొన్నారు. మొదట్లో ఈశాన్య భారతంలో వేర్పాటు రాజకీయాలు జరిగేవని, తమ హయాంలో మాత్రం పాలన ఆధారంగా జరిగేలా నిర్ణయించామన్నారు.
నాగాలాండ్ లోశాశ్వతంగా శాంతి నెలకొల్పేందుకు తాము పనిచేస్తున్నామని అన్నారు. దీని కోసమే 1958 నుంచి కొనసాగుతున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేశామని గుర్తు చేశారు. తమ సొంత ప్రజలను నమ్మకుండా, గౌరవించకుండా, సమస్యలను పరిష్కరించకుండా దేశాన్ని నడపలేమన్నారు. బీజేపీ ప్రజలను మతం, ప్రాంతం ఆధారంగా విభజన చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నాగాలాండ్ లో రాజకీయ అస్థిరత వుండేదని, ఇప్పుడు అలా లేదన్నారు. నాగాలాండ్ ను నడపడానికి తాము మూడు సూత్రాలను అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. టెక్నాలజీతో అవినీతికి చెక్ పెట్టడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.