మాతృ భాషపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూపిన శ్రద్ధ మాటల్లో చెప్పలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడు ఏ పదవిలో వున్నా… యువకుల కోసమే పనిచేశారని, సభలోనూ ప్రతి సారీ యువ ఎంపీలను ఆయన ప్రోత్సహించారని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిర్వహించిన వెంకయ్య నాయుడు వీడ్కోలు సభలో మోదీ పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు.
వెంకయ్య నాయుడి జీవితం నుంచి తామెంతో నేర్చుకున్నామని, వాటిని తమ జీవితంలో కూడా కొనసాగిస్తామని మోదీ అన్నారు. పార్లమెంట్ కమిటీలను అద్భుతంగా మెరుగుపరిచి, రాజ్యసభ పనితీరును బాగు చేశారని అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణకు ఆయన చాలా చేవారని, ఆయన పాటించిన ప్రమాణాలతో ప్రజాస్వామ్యం మరింత ఉచ్ఛ దశకు వెళ్లిందని మోదీ పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ కొత్తదనాన్ని చూపించారని, పూర్తి ఉత్సాహం, నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయ జీవితం ప్రారంభించారని, సామాన్య విద్యార్థి కార్యకర్తగా జీవితం ప్రారంభించి, పార్టీ జాతీయ అధ్యక్స బాధ్యతలు చేపట్టారని మోదీ కొనియాడారు.