ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రభుత్వం చేపట్టే మంచి పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, అన్నింటికీ రాజకీయ రంగు పులిమేస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ సమీకరణ రవాణా కారిడార్ లో సొరంగ మార్గాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగానే మోదీ పై వ్యాఖ్యలు చేశారు. అయితే నేరుగా అగ్నిపథ్ పథకంపై చేస్తున్న ఆందోళనలను నేరుగా ఎక్కడా ప్రస్తావించలేదు. దేశం కోసం చేసే ప్రతి పనినీ అడ్డుకుంటున్నారని, ప్రతి దానికీ కోర్టులకు వెళ్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. టీఆర్పీ రేటింగుల కోసం మీడియాను కూడా ఇందులోకి లాగుతున్నారని విమర్శించారు.
ప్రజలకు ఆదా అయ్యే కార్యక్రమాల గురించి ఎక్కడా మాట్లాడరని, 100 రూపాయలిస్తే మాత్రం పెద్ద పెద్ద వార్తలు రాస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా.. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లడం ఎలాగో దేశానికి తెలుసని మోదీ చురకలంటించారు.