వచ్చే నెల 1,2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు, ఇతర బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. మూడు 3 రోజుల పాటు ప్రధాని మోదీ హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రధాని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎస్పీజీ అధికారులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు పలు దఫాలుగా సమావేశమయ్యారు.
అయితే.. తొలుత ప్రధాని మోదీ రాజ్ భవన్ లోనే బస చేస్తారని అందరూ భావించారు. నోవాటెల్ హోటల్ రెండో ఆప్షన్ గా వుంది. అయితే.. రాజ్ భవన్ సిటీ నడిబొడ్డున వుండటం, నిరసనలకు అవకాశం వుంటుందని ఎస్పీజీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమావేశాల ప్రాంగణానికి రావడం, పోవడం సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుందని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో చివరికి ప్రధాని బసకు నోవాటెల్ హోటల్ వైపే మొగ్గు చూపారు. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లోనే బస చేయనున్నారు. ఈ హోటల్ లో మొత్తం 288 గదులున్నాయి. ప్రధాని బస కోసం మొత్తం ఒక ఫ్లోర్ నే రిజర్వు చేశారు. ఇక్కడి నుంచే ప్రధాని మోదీ హెచ్ఐసీసీ ప్రాంగణానికి వస్తారు.