బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు సాధారణ ప్రజానీకానికి అవకాశం కల్పించనున్నారు. ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు.
‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట ఈ వైమానిక ప్రదర్శన నిర్వహిసతున్నారు. 809, రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ఇందులో ప్రదర్శిస్తారు. భారత్ తో సహా… ఆయా దేశాలు రక్షణ రంగంలోని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఆర్మీ ఏవియేషన్, హెచ్ సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్అండ్ టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, HAL, BEAL, BDL, BEML వంటి సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. 32 దేశాల రక్షణ మంత్రులు, 29 దేశాల వైమానిక దళ చీఫ్ లు, 73 కంపెనీల సీఈఓలు, 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటారు.
ఇంత పెద్ద సంఖ్యలో వీరందరూ పాల్గొనడం ఇదే ప్రథమం. ఇందులో కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా వున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రోజువారీ ప్రదర్శనలో పాల్గొంటాయి. అమెరికా నేవీకి చెందిన అత్యంత అధునాతన బహుళ సాధన యుద్ధ విమానం సూపర్ హర్నెట్ F/A-18E, F/A-18Fలు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి. మొత్తం , రూ.75,000 కోట్ల పెట్టుబడుల కోసం భారత, విదేశీ రక్షణ సంస్థలతో 251 ఒప్పందాలను చేసుకోనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… ఆధునిక భారత సామర్థ్యాలను చాటిచెప్పేందుకే బెంగళూరు గగనతలం వేదికైందని ప్రశంసించారు. ఏరో ఇండియా షో అనేది భారత బలాన్ని, సామార్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఎయిర్ షో ప్రదర్శన మాత్రమే కాదని, భారత ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 100 దేశాలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే… భారత్ పై ప్రపంచ దేశాలకు ఎంతగా నమ్మకం పెరిగిందో ఊహించుకోవచ్చన్నారు. 21 వ శతాబ్దిలో వున్న ఆధునిక భారత దేశం ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదని, లేదా… కష్టపడి పనిచేయడంలో వెనకంజ వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
ఇంత పెద్ద ఎయిర్ షోకి తమ రాష్ట్రం వేదికైనందుకు సంతోషంగా వుందని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ తన స్థాయిని మరోసారి నిరూపించుకుందని పేర్కొన్నారు. భారత్ దేశం విశ్వగురు స్థాయిగా ఎదిగే క్రమంలో అన్ని రకాలుగా కర్నాటక తన వంతు పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు.