ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్నాటక సీఎం బొమ్మై కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… ఆధునిక భారత సామర్థ్యాలను చాటిచెప్పేందుకే బెంగళూరు గగనతలం వేదికైందని ప్రశంసించారు. ఏరో ఇండియా షో అనేది భారత బలాన్ని, సామార్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఎయిర్ షో ప్రదర్శన మాత్రమే కాదని, భారత ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 100 దేశాలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే… భారత్ పై ప్రపంచ దేశాలకు ఎంతగా నమ్మకం పెరిగిందో ఊహించుకోవచ్చన్నారు. 21 వ శతాబ్దిలో వున్న ఆధునిక భారత దేశం ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదని, లేదా… కష్టపడి పనిచేయడంలో వెనకంజ వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. సంస్కరణల మార్గంలో ప్రయాణిస్తున్నామని, ప్రతి రంగంలో విప్లవాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. అనేక దశాబ్దాలుగా భారత దేశం రక్షణ రంగంలో దిగుమతిదారుగా మాత్రమే వుండేదని, ఇప్పుడు భారత్ 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయిలో వుందని హర్షం వ్యక్తం చేశారు.
భారత్ నేడు ప్రపంచంలోని రక్షణ సంస్థలకు కేవలం మార్కెట్ దేశంగా మాత్రమే లేదని, అత్యంత సమర్థవంతమైన, సంభావ్యమైన రక్షణ భాగస్వామిగా నిలుస్తోందన్నారు. రక్షణ రంగటంలో చాలా ముందున్న దేశాలు, రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ దేశాలతో కూడా నేడు భాగస్వామ్యం నడుపుతున్నామని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఎగుమతిదారుగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.